Singareni:సింగరేణిలో 485 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. సింగరేణి సంస్థ(Singareni)లో మొత్తం 485 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్(Job Notification) విడుదల కానుంది. 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ తెలిపారు. బుధవారం సింగరేణి డైరెక్టర్లతో సీఎండీ బలరామ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమాపై యూబీఐతో గురువారం కీలక ఒప్పందం జరుగనుందని సీఎండీ వెల్లడించారు.
సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో... ఈ ఏడాది సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలన్నారు. కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లో సింగరేణి అతిథి గృహం నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సహకారం అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు .