తెలంగాణ బంగారుమయం కావాలంటే బీఆర్ఎస్ను బొందపెట్టాలే - జూపల్లి

Update: 2023-06-21 11:45 GMT

కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుపుతున్న కేసీఆర్కు సీఎంగా కొనసాగే హక్కులేదని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డితో భేటీ అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే బంగారు తెలంగాణ అవుతుందని అనుకున్నారని... కానీ కొందరికి మాత్రమే బంగారు తెలంగాణ పరిమితమైందని వాపోయారు. రాష్ట్రంలో తెలంగాణను వ్యతిరేకించే వాళ్ల పెత్తనం కొనసాగుతోందన్న జూపల్లి.. అమరవీరుల కలలు సాకారం అవ్వాలంటే బీఆర్ఎస్ను బొందపెట్టాలన్నారు.

పైసల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసిన కేసీఆర్...పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాత్రం నిర్లక్ష్యం వహించారని జూపల్లి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాను కేసీఆర్ నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని సటైర్ వేశారు. ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి దాని వెనుక ఎంత అవినీతి జరిగిందో కూడా చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు.




 


బీఆర్ఎస్ పై తాను నాలుగేళ్ల క్రితమే తిరుగుబావుటా ఎగురవేశానని జూపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరికపై అందరితో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్.. రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.




Tags:    

Similar News