జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు మా పోరాటం ఆగదు : కవిత
బీసీల అభ్యున్నతే ధ్యేయంగా భారత్ జాగృతి పోరాటం చేస్తుందని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటే తమ ధ్యేయమన్నారు. దీన్ని కోసం బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావ్ పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ హైదరాబాద్లో భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. ఏప్రిల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
భారత జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టామని కవిత తెలిపారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం కోసం పోరాడి సాధించామని చెప్పారు. అదేవిధంగా ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించినట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటాపై చిత్తవుద్ధితో పనిచేస్తున్నట్లు వివరించారు. బడుగుల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిన అవరముందని అభిప్రాయపడ్డారు. దీన్ని కోసం స్పీకర్ కు వినతి పత్రం కూడా అందించామని చెప్పారు.