జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్లో లొల్లి రచ్చకెక్కింది. కడియం శ్రీహరిపై నిన్న ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. కడియం ఎస్సీ కాదని ఆయన తల్లి బీసీ అని ఆరోపించారు. అంతేకాకుండా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కడియం స్పందించారు. ఆరోపణలను నిరూపించకపోతే రాజయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు వారం రోజులు డెడ్ లైన్ విధించారు.
తన కులం, తన తల్లి కులం గురించి రాజయ్య మాట్లాడటం దారుణమని కడియం అన్నారు. ‘‘ నా తండ్రి ఎస్సీ.. నా తల్లి బీసీ. పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటు. సమాజంలో ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారు. అసమర్థ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు’’ అని మండిపడ్డారు.
తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమని కడియం సవాల్ విసిరారు. ఎవరినైనా మోసం చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. రాజయ్య చేసిన ఆరోపణలు నిరూపించకపోతే వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన బిడ్డను చూసి రాజయ్య భయపడుతున్నారని.. గెలిచే అవకాశాలు ఉన్నవారికే పార్టీ టిక్కెట్ ఇస్తుందని అన్నారు. పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించి తీరుతామని చెప్పారు.