Katipally Venkataramana Reddy: మహిళలపై సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఈ సౌకర్యం కల్పించింది. ఈ సౌకర్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ కోసం మహిళలు కేవలం బస్సులనే వినియోగించడం వల్ల.. ఆయా మార్గాల్లో బస్సులన్నీ నిండిపోతున్నాయి. చాలినన్ని బస్సులు లేకపోవటంతో కొందరు ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మగవారైతే డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కున్నా.. కనీసం నిల్చుకునేందుకు కూడా బస్సుల్లో స్థలం దొరకట్లేదని వాపోతున్నారు. ఫుట్ బోర్డింగ్‌తో పాటు, వెనక ఉన్న నిచ్చెనపై నిలబడి ప్రయాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో బస్సులు సరిపోవడం లేదని టీఎస్ ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.
నెలకు 10వేలు సంపాదించే మహిళలు ఫ్రీ బస్సు వాడితే బిచ్చమెత్తుకున్నటే నా దృష్టిలో - కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి pic.twitter.com/oTvg9rVKBb
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2024
ఈ క్రమంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహిళలకు ఫ్రీ జర్నీ పై మాట్లాడుతూ.. నెలకు రూ.10 వేలు ఆదాయం వస్తున్న మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటే ... వారంతా తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వాళ్లని వ్యాఖ్యానించారు. ఫ్రీ ఎవరికి ఉండాలో వారికే ఉండాలని, అలా కాకుండా ఆర్థిక స్థోమత ఉండి కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తే.. పక్షవాతంతో గుడి దగ్గర బిచ్ఛమెత్తుకున్నట్లేనని అన్నారు. ఆదాయం, ఆస్తులు భారీగా ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్న వాళ్లంతా బిచ్చగాళ్లేనని, శవాల మీద పేలాలు ఏరుకునేవారితో సమానమని అన్నారు. ప్రస్తుతం ఫ్రీ బస్సు సౌకర్యం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.