కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం

Update: 2024-02-03 12:23 GMT

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజల సమస్యలను కంప్లైంట్ బాక్స్ వేయాలని సూచించారు. వారానికి ఒక రోజు ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకోని నిర్ణయం ఆయన తీసుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో వెంకటరమణరెడ్డి 15 వేల ఓట్లు సాధించుకుని మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఆయన దేశంలోనే అరుదైన చరిత్రను సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ లపై ఆయన నిలబడేందుకు సాహసించారు.

ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇక్కడి నుండి పోటీ చేయడంతో దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉద్దండులపై విజయం సాధించి వెంకట రమణారెడ్డి సంచలనం సృష్టించారు. అయితే ఆయన విజయం వరకే సంచలనాలు నమోదు చేయడంతో సరిపెట్టకుండా ఎన్నో వైవిద్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా క్షేత్రంలో అందరి నోట భేష్ అనిపించుకుంటున్నారు. క్షేత్ర స్థాయ సమస్యలు తెలుసుకోవడంలో భాగంగానే ఎమ్మెల్యే ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజమైన భూ బాధితులు ఉన్నట్టయితే తనను నేరుగా వచ్చి కలవాలని వారికి బాసటగా ఉండి ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టనని గతంలోనే ప్రకటించారు ఎమ్మెల్యే. ఇలా సామాన్యులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న వెంకట రమణా రెడ్డి సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. 

Tags:    

Similar News