అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కంటి వెలుగు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు అధునాతన సేవలను అందిస్తోంది రాష్ట్ర సర్కార్ . పేదల కోసం చేపట్టిన ఈ రెండో విడత కార్యక్రమం రికార్డులను సృష్టిస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేవలం 100 రోజుల్లోనే 1.62 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి వెల్లడించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారీ సంఖ్యలో ఫ్రీ గా నేత్రపరీక్షలు నిర్వహించామన్నారు. ఈ ఘనత అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని చెప్పారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 అత్యాధునిక పాకో యంత్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో వచ్చిన రెస్పాన్స్ గురించి ఆయన తెలిపారు.
" కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో పాకో యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. కాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహణలో ఈ పాకో యంత్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అల్ట్రా సౌండ్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రాలతో సర్జరీలను ఎంతో సులభంగా చేయవచ్చు. అంతే కాదు వేగంగా సర్జరీ పూర్తి చేసే వీలుంటుంది. ఇప్పటివరకు పాకో యంత్రాలు కేవలం సరోజిని ఆస్పత్రిలోనే ఉండేవి. అవి చాలకపోవడం వల్లనే రూ.3.5 కోట్లు ఖర్చు చేసి 12 పాకో యంత్రాలను అందుబాటులోకి తసుకువచ్చాము. ఈ 12 యంత్రాల్లో రెండింటిని సరోజిని ఆస్పత్రికి కేటాయించాము. మిగిలినవాటిని మలక్‌పేట ఏరియా ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం.
ప్రైవేటు హాస్పిటల్స్లో పాకో యంత్రంతో సర్జరీ చేయాలంటే రూ.40 వేల వరకు అవుతుంది. అంతటి ఖరీదైన సర్జరీలను కూడా పేదల కోసం ఉచితంగా చేస్తున్నాము. ఈ సర్జరీల నిర్వహణ కోసం సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నాము. కంటి వెలుగు ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలు వెళ్తున్నాయి. ఈ రెండో విడత కంటి వెలుగులో 40.59 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలు అందించాము. మొదటి కంటి వెలుగు కన్నా రెండో విడత కార్యక్రమం ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. , కేవలం 100 రోజుల్లోనే 1.62 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. ప్రపంచంలోనే ఇలాటి వైద్య సేవలు ఎక్కడా జరగలేదు. ఈ ఘనత కేసీఆర్ దే" అని మంత్రి హరీష్ రు తెలిపారు.