Yadadri Income: సామూహిక వ్రతాలు.. ఆదాయం ఫుల్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-13 08:37 GMT

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కార్తీక మాసంలో భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. కార్తిక మాసంలో ఏక శిఖర వాసుడి ఆలయ ఖజానాకు రూ.14.91 కోట్ల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా ఈ నెల 10 వ తేదీన కార్తీకమాసం అందులోనూ సెలవు దినం(ఆదివారం) కావటంతో.. స్వామి వారిని 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టుగా ఆలయ అధికారులు అంచనా వేశారు. దీంతో ఒక్కరోజులోనే ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు పేర్కొన్నారు. ఆలయానికి కార్తీక మాసంలో వచ్చిన మొత్తం ఆదాయంలో సింహభాగం ఆదాయం ఈ ఒక్కరోజులోనే సమకూరింది.

నవంబర్​ 14న మొదలైన కార్తిక మాసం ఈ నెల 12న మంగళవారంతో ముగిసింది. శివ, కేశవుల ఆలయాలున్న ఈ క్షేత్రం సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు, దీపోత్సవం, తులసీ ఆరాధనలతో, భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తిక మాసం తొలి రోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరాయని ఆలయ ఈవో గీత తెలిపారు. 37,698 మంది భక్తులు తల నీలాలు సమర్పించారని, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,50,79,660 ఆలయ ఖజానాకు సమకూరాయని చెప్పారు. బ్రేక్, శీఘ్ర దర్శనాలతో రూ.1,69,19,100 రాగా, కొండపై వాహనాల పార్కింగ్ రుసుం ద్వారా రూ.1,13,50,000 వచ్చాయని దేవాలయ ఈవో గీత వివరించారు. గత ఏడాదితో పోల్చితే రూ.24.66 లక్షల ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. 




Tags:    

Similar News