తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ఇటీవలే టీటీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్లో సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో అనుచరులతో ఆయన ఎర్రవెల్లికి వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న తెలుగు దేశం పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోకేష్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని, జైలులో చంద్రబాబును కలిసినప్పుడు ఆయన.. తెలంగాణలో పోటీ చేయడం లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ ఎందుకు చేయట్లేదన్న అంశంపై బాబు క్లారిటీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రలో టీడీపీ - జనసేన, తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తు ఎలా సాధ్యమని కాసాని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనుచరులతో సమావేశమైన ఆయన.. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.