రాష్ట్రంలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Byline :  Kiran
Update: 2023-10-07 15:54 GMT

రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. మహాదేవపూర్, కాటారం, మాహాముత్తారం, మల్హర్, పలిమల మండలాలను రెవెన్యూ డివిజన్‌లో భాగం చేసింది. ఆగస్టులో కాటారం మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిపై

అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం.. తాజాగా తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని 6 మండలాలు మంథని నియోజకవర్గంలోని 5 మండలాలతో కలిపి మొత్తం 11 మండలాలతో భూపాలపల్లి డివిజన్‌ ఏర్పాటు చేసింది. తాజాగా 5 మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.

మరోవైపు ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

ములుగు డివిజన్‌లో గోవిందరావుపేట, వెంకటాపూర్‌, ములుగు మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నది. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది.




Tags:    

Similar News