కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుగతోంది.. ప్రధాని
కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యాప్తు జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయని.. నీళ్లు , నిధులు, నియామకాల పేరు చెప్పి దోచుకున్నారన్నారు. తెలంగాణ లూటీ చేశాక కేసీఆర్ దృష్టి దేశంపై పడిందన్నారు. అక్కడ లూటీ చేసేందుకు ఢిల్లీలో ఒక నేతతో చేతులు కలిపారని.. మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్‌లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని విమర్శించారు.
భూనిర్వాసితులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు మోదీ.
ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. రైతులను మోసం చేయడంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒకరికొకరు తీసిపోరన్నారు. తెలంగాణలో ఈసారి ఓ కొత్త సంకల్పం కనిపిస్తోందని.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజల్లో సంకల్పం మొదలైందన్నారు. బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నిర్ణయించింది. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. చిన్న రైతులను ఆదుకునేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, తెలంగాణ రైతులను ఆదుకునేందుకు 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనాలని నిర్ణయించామన్నారు.