తల్లుల దీవెనలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలి...కేసీఆర్

By :  Vinitha
Update: 2024-02-22 12:09 GMT

మేడారం మహాజాతర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాలచేత మేడారం సమ్మక్క, సారలమ్మ పూజలందుకుంటున్నారని అన్నారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క-సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు.

ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్యపాలకుల ఏలుబడిలో గోదావరీ పరీవాహక ప్రాంతం అలజడులకు గురైందని గుర్తు చేశారు. అయితే నేడు అదే ప్రాంతం సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో వెలుగు నింపిందని తెలిపారు. అయితే ఈ మహాజాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు తరలివస్తారని అన్నారు. తల్లుల దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను గులాబీ లీడర్ కేసీఆర్ ప్రార్థించారు.

Tags:    

Similar News