చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదామా: కేసీఆర్

Update: 2023-06-04 14:49 GMT

నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 56.2 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించిన కేసీఆర్.. జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంమయిందని, రైతుల కష్టాలు తీరాయని అన్నారు.

గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైన అవినీతి ఉండేదని, ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో తెలిసేది కాదని అన్నారు. ధరణి వచ్చాక అవినీతి తగ్గిందని.. అలాంటి ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అనడం సిగ్గుచేటని కేసీఆర్ అన్నారు. ధరణిని వ్యతిరేకించిన వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలని మండిపడ్డారు. ధరణి పోర్టల్ తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? తొలగించాలా..? వద్దా? అని ప్రజలు ఆలోచించాలన్నారు. ఎస్సారెస్పీ కింద 2 స్కీములు త్వరలో పూర్తి చేస్తామని.. దాని ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని తెలిపారు.

తాలూకా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్న కేసీఆర్.. దీని ద్వారా ఎంతోమంది యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంత కరెంట్ వాడుకున్నా అడిగేవాళ్లు లేరని.. ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజక వర్గానికి 3 వేల ఇళ్లని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే ప్రతి ఒక్కరికి రూ.3 లక్షలు మంజూరు చేస్తున్నారు. యాదవ సోదరులకు రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 

Tags:    

Similar News