BRS Manifesto : హ్యాట్రిక్ గెలుపే లక్ష్యం.. ఆసరా పెన్షన్ రూ. 5వేలకు పెంపు..

By :  Kiran
Update: 2023-10-15 10:50 GMT

హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టో విడుదల చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పథకాలు ప్రకటించారు. ప్రస్తుతం అమలుచేస్తున్న పథకాలన్నింటినీ కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు అర్హులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని విడతలవారీగా రూ.5వేలకు పెంచుతామని బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు.

ఐదేళ్లలో రూ.5వేలు

రాష్ట్రంలో ప్రస్తుతం దివ్యాంగులకు మినహా మిగిలిన అన్ని వర్గాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.2016 పెన్షన్ ఇస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ మొత్తాన్ని విడతలవారీగా రూ.5016కు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది రూ.1000 పెంచి ప్రతి నెలా రూ.3016 అందిస్తామన్న ఆయన.. ఆ తర్వాత ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.5016కు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

దివ్యాంగులకు రూ. 6వేలు

ఇక దివ్యాంగులకు ఇస్తున్న రూ.4,016 ఫించన్ మొత్తాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 5,016కు పెంచనున్నట్లు బీఆర్ఎస్ అధినేత హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదికి కొంత మొత్తం చొప్పున ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.6,016కు పెంచుతామని స్పష్టం చేశారు. అర్హులైన పేద మహిళలందరికీ నెలకు రూ.3000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు.

Tags:    

Similar News