Kcr Nalgonda Meeting: ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ వదులుకోదు

Byline :  Bharath
Update: 2024-02-13 12:42 GMT

ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఇది రాజకీయ సభ కాదని.. నీళ్లపై జరుగుతున్న ఉద్యమ సభ అని కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఫ్లోరైడ్ భూతంతో నల్గొండ బిడ్డల నడుం వంగిపోయిందని, ఈ విషయాన్ని గత నాయకుల ముందుకు ఎన్నిసార్లు తీసుకొచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఇది తెలంగాణ ప్రాంతాలకు జీవన్మరణ సమస్యని, దీనిపై బీఆర్ఎస్ పార్టీ తప్పకపోరాడుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చి, బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత నల్గొండను జీరో ఫ్లోరైడ్ గా మార్చామని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ బాధలను తీర్చామని చెప్పారు.

ఇది రాజకీయ సభ కాదని, మన నీళ్లను దొబ్బిపోదాం అనుకునే ప్రతీ ఒక్కరికి హెచ్చరించే హెచ్చరిక సభ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం, మహబూబ్ నగర్,నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల జీవర్మరణ సమస్య ఇది.

నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడాలని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏనాడు రాష్ట్రానికి తక్కువ చేయలేదని అన్నారు. ఎక్కడో ఉన్న కరెంట్ ను తీసుకొచ్చి, నిమిషం పాటు కరెంట్ పోకుండా ప్రజలకు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని తెలిపారు.

పదేళ్ల పాలనలో ప్రతీ ఇంటికి మంచినీళ్లను అందించాం. ఒకప్పుడు ఆముదాలు, బత్తాయి తోటలు మాత్రమే పండిన నల్గొండలో.. లక్షల టన్నుల వడ్లు పండించే పరిస్థితిని తీసుకొచ్చింది బీఆర్ఎస్. పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమీ లేకపోయే అని పాడుకునే రోజుల నుంచి.. గోదావరి, కృష్ణా జలాలను మన బీళ్లకు మళ్లించామని చెప్పారు. ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని.. దున్నపోతును తెచ్చుకున్నారని ఆరోపించారు. నీళ్ల కోసం పోరాటం మానేసిన కాంగ్రెస్.. కొత్త పంచాయితీలు తీసుకొస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. కేఆర్ఎంబీకి మన నీళ్లు అప్పజెప్పి.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అంటున్నారని ఫైర్ అయ్యారు. అదే నిజమైతే తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడామని కేసీఆర్ ప్రశ్నిచారు.

బీఆర్ఎస్ కొట్లాడిందే నీళ్ల కోసం. మన వాటా కోసమని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ మన నీళ్లను అమ్మేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో చర్చకు తీసుకొస్తుంటే.. విషయాన్ని దాటేస్తున్నారు. ఇలా కాదని విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని చలో నల్గొండ సభ పెట్టామని స్పష్టం చేశారు. చివరి కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పోరాడుతానని.. పులిలా ఎగసి పడతానని కేసీఆర్ తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ నాడు, నేడు పదవుల కోసం, డబ్బుల కోసం పాకులాడుతుందని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంట్.. దద్దమ్మల పాలన రాగానే ఎట్ల పోతుందని నిలదీశారు. కరెంట్ కష్టాలను మళ్లీ ఎదురుకోకుండా కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని రకాల వసతులు, ప్రాజెక్టులు తీసుకొచ్చినా కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. ఈ ఉద్యమం ఇక్కటితో ఆగదని.. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు, కరెంట్ కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ ముందుకొచ్చి నిలబడి నిలదీస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ వదులుకోదు. ఎక్కడికక్కడ నిలదీసి తీరుతామని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News