ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోమవారం 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ 4 స్థానాలకు నాలుగు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు రాబోయే నాలుగు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేస్తామని చెప్పారు సీఎం. అయితే ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. కేవలం ఈ 4 స్థానాలను ఎందుకు ప్రకటించలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నర్సాపూర్ నియోజకవర్గంలో.. సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సునీతాలక్ష్మారెడ్డిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై బీఆర్‌ఎస్ యోచిస్తోంది. నర్సాపూర్ స్థానానికి తమ అభ్యర్ధి ఎవరన్నదానిపై సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ పర్యటన అనంతరం స్పష్టతనివ్వనున్నట్టు సమాచారం. ఇక జనగామ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానంలో పల్లా రాజేశ్వరరెడ్డిని పోటీ చేయించాలని కేసీఆర్ సూచించారట. అందుకే పల్లా ఇటీవల జనగామ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారని టాక్.
హైదరాబాద్ జిల్లాలోని గోషామహల్, నాంపల్లి స్థానాల్లో ఒకటైన నాంపల్లి సెగ్మెంట్ ప్రస్తుతం మజ్లిస్ ఖాతాలో ఉంది. ఇక్కడ మజ్లిస్, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మజ్లిస్‌తో స్నేహపూర్వక పోటీ కోసం ఇక్కడ బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరు? అనేదానిపై ఓ అంచనాకు వచ్చాక తమ అభ్యర్థిని బీఆర్‌ఎస్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేయడంతో గోషామహల్‌ను ఈసారి ఎలాగైనా ఖాతాలో వేసుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. ఇక్కడ పోటీకి గ్రంథాలయం సంస్థల మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్, నందకిషోర్ వ్యాస్, అడ్వొకేట్ రాజశేఖర్, మమత సంతోష్ గుప్తా టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే అసంతృప్తులు భగ్గుమంటాయన్న అంచనాతోనే గోషామహల్‌ను పెండింగ్‌లో పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25న అన్ని పెండింగ్ స్థానాలను బీఆర్‌ఎస్ ప్రకటించనుంది.