రాజీనామాలు చేశాం తప్పా రాజీ పడలేదు : Harish Rao

Byline :  Krishna
Update: 2024-01-06 09:39 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని.. కొద్ది రోజుల్లోనే ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌లో కార్యకర్తలను కలుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ తెచ్చిన పథకాలను రద్దు చేయడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్‌ కిట్లపై కేసీఆర్‌ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి మాత్రం తొలగించలేరని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్పా రాజీ పడలేదని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పోషిస్తున్నాం.. సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కొనేలా ఉందని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని.. కానీ ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని చెప్పారు. ఈ ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ లాంటిదని.. కార్యకర్తలకు అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.

Tags:    

Similar News