కాంగ్రెస్ రెండో జాబితాలో ఎవరికి షేక్ హ్యాండ్.. ఎవరికి హ్యాండ్..
తెలంగాణలో ఈ సారి ఎలాగైన అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను సరికొత్త విధానంలో చేపడుతోంది. ఇప్పటివరకు మొత్తం 100సీట్లలో హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 55, రెండో జాబితాలో 45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో పెద్దగా పోటీ లేని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా.. రెండు జాబితాలో కీలక స్థానాలను ప్రకటించింది. ఇందులో పలు ఆసక్తికర పేర్లు తెరమీదకు వచ్చాయి.
కాంగ్రెస్లో చేరిన రెండో రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. మునుగోడు టికెట్ను పాల్వాయి స్రవంతి, చలిమెల కృష్ణారెడ్డి ఆశించారు. వారికి షాకిస్తూ అధిష్టానం కోమటిరెడ్డికే టికెట్ ఇచ్చింది. అదేవిధంగా మహబూబాబాద్ టికెట్ను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆశించారు. అయితే ఆ స్థానాన్ని మురళీ నాయక్కు ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్, రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ అధిష్టానం కేటాయించింది.
జూబ్లీహిల్స్ స్థానం నుంచి పీజేఆర్ తనయుడు విష్ణుకు కాకుండా అజారుద్దీన్ను బరిలో నిలిపింది కాంగ్రెస్. అయితే ఆయన కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చింది. ఖైరతాబాద్ టికెట్ ఆశించిన రోహిన్ రెడ్డికి అంబర్ పేట టికెట్ ఇచ్చింది. ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. అధిష్టానం మాత్రం రేవంత్ అనుచరుడైన రోహిన్ రెడ్డికే ఇచ్చింది. ఇక ఎల్బీ నగర్ స్థానంపై పలువురు కీలక నేతలు కన్నేశారు. కానీ ఆ స్థానాన్ని సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ అయిన మధుయాష్కి గౌడ్కే ఇచ్చారు.
ఇక ఇటీవలె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్కు ఆసీఫాబాద్ టికెట్ ఇచ్చారు. అదేవిధంగా పాలకుర్తి నుంచి ఝాన్సీరెడ్డి కోడలు యశశ్విని రెడ్డిని బరిలో నిలిపింది. ఈ స్థానం నుంచి ఝాన్సీరెడ్డి పోటీచేయాలని భావించిన ఆమె పౌరసత్వం వివాదం నేపథ్యంలో ఆమె కోడలికి టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ను పిడమర్తి రవి ఆశించగా.. ఆ స్థానంలో గద్దర్ కూతురు వెన్నెల వైపు అధిష్టానం మొగ్గు చూపింది. కూకట్ పల్లి టికెట్ను మన్నే సతీష్ ఆశించగా.. అధిష్టానం ఇటీవల పార్టీలో చేరిన బండి రమేష్కు కేటాయించింది.