అవినీతిలో మన రాష్ట్రమే నెంబర్ వన్.. ఏపీపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..
దేశంలోనే అతి పెద్ద అవినీతి రాష్ట్రం ఏపీనే అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా 2014కు ముందుగా అవినీతి గురించి ఆమె వివరాలను తెలియజేశారు. అయితే ఏపీకి సంబంధించిన అవినీతి చిట్టా గురించి ఆమె ప్రస్తావించకపోవడంపై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక అవినీతి జరిగిన ఏపీపై శ్వేతపత్రంలో నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతికి రారాజు అయిన వ్యక్తి 2004-14 వరకూ పరిపాలించారని, ఆ సమయంలోనే అవినీతి యువరాజు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. 2004లో ఆ యువరాజు ఆస్తులు చూస్తే రూ.1.70 కోట్లు ఉండగా 2004 నుంచి 2011 మధ్యలోనే ఆయన ఆస్తులు రూ.356 కోట్లకు పెరిగినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏడేళ్లకాలంలోనే ఆ రారాజు ఆస్తులు భారీగా పెరిగాయని, ఈడీ, ఐటీ, సీబీఐ కూడా ఆయన ఆస్తుల పెరుగుదల గురించి తెలిసి ఆశ్చర్యపోయాయన్నారు. అందుకే ఆ రారాజుపై 32 కేసులు ఉన్నాయని, రూ.43 వేల కోట్ల వరకూ ఆస్తులను అవి అటాచ్ చేశాయని వెల్లడించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకూ కూడా ఏపీలో ఒక్కటంటే ఒక్కటి అవినీతి కేసు నమోదు కాలేదన్నారు. ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఓటు వేశారని, సీఎంగా చంద్రబాబును ఎన్నుకున్నారని, కానీ 2019లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అధికారంలోకి వచ్చారని, ఆయన వచ్చాక మాఫియాను లీగలైజ్ చేశారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో మద్యాన్ని యూపీఐ చెల్లింపులతో, కార్డుతో కొనుక్కోలేమని, కనీసం రసీదు కూడా పొందలేమని, మద్యంలో ఎంతో మంది అవినీతి సొమ్మును సృష్టిస్తున్నారని వివరించారు. అటువంటి అతిపెద్ద అవినీతి రాష్ట్రం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్వేతపత్రంలో చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.Kinjarapu Ram Mohan Naidu shocking speech in loksabha