కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుందన్నారు బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని, అందుకే బీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఎంఐఎంతో మధ్యవర్తిత్వంతో ప్రస్తుత సీఎం, మాజీ సీఎంల మధ్చ అవగామన కుదిరిందని విమర్శించారు. ఈ మూడు పార్టీలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టకుండా కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరిపించాలని కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేఖ రాయట్లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
మేడిగడ్డను సందర్శించిన కేంద్ర ఇంజినీర్లకు కూడా సరైన వివరాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం (బీఆర్ఎస్) దాచిపెట్టిందని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తే.. 48 గంటల్లో కేంద్రం సీబీఐ విచారణ జరిపిస్తుందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి భూ పరీక్షలు జరిపించలేదని.. ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని మండిపడ్డారు. ఈ అవినీతి విషయంలో ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. అందుకే రాష్ట్రానికి సీబీఐని అనుమతించట్లేదని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తుందా లేదా.. ప్రాజెక్ట్ అవినీతిపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.