రీజినల్ రింగ్‌రోడ్డు చుట్టూ రింగ్ రైల్వే ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి

Update: 2023-06-29 04:21 GMT

తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపేందుకు నిర్మించే రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు అనుబంధంగా ఔటర్ రైల్వే రింగ్ లైన్‌ అందుబాటులోకి రానుంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ విషయం వెల్లడించారు. ప్రాజెక్టు సర్వే కోస రూ. 14 కోట్లను కేటాయించామని తెలిపారు.

ఆర్ఆర్ఆర్, ఔటర్‌ రింగ్‌ రైల్‌ ప్రాజెక్టులతో హైదరాబాదే కాకుండా, తెలంగాణ రాష్ట్ర రూపురేఖలే సంపూర్ణంగా మారిపోతాయని మంత్రి చెప్పారు. వీటితో ఆయా ప్రాంతాల్లో రైల్వే లైన్లు ఏర్పడి, హైదరాబాద్‌తో రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు మారతాయని అన్నారు. ‘‘ఇప్పటి వరకు రైలు సదుపాయాలు లేని ప్రాంతాలకు రైళ్లు వస్తాయి. సిటీకి నలువైపులా రైల్వే లైన్లలో లింకులు ఏర్పడతాయి’’ అని ఆయన చెప్పారు. రూ.330 కోట్ల నిధులతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణను పూర్తిగా కేంద్రమే చేపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఖర్చులో మూడింట రెండొంతుల మేర రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉన్నా ముందుకురాకపోవడంతో కేంద్రమే భరించనుందన్నారు. అలే కరీంనగర్‌– హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణం కోసం సర్వే పూర్తి చేయడానికి రూ.1.5 కోట్లు కేటాయించామని బుధవారం ఢిల్లీలో విలేకర్లకు తెలిపారు.

Tags:    

Similar News