టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. తెలంగాణలో 9 ఏళ్లుగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడిన తెలంగాణలో ఆ మూడు లేక సతమతమవుతున్నామని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రిక్రూట్మెంట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం యువతకు శాపంగా మారిందని మండిపడ్డారు. హాల్‌టికెట్లపై ఫొటోలు లేకపోవడం, బయోమెట్రిక్ స్క్రీనింగ్ తొలగించడం పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనడానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయడం తప్ప కోర్టు ముందు మరో మార్గం లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారని కిషన్‌రెడ్డి ప్రకటించారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పాలమూరులో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని వెల్లడించారు.