కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా నియోజకవర్గ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తూ జనంలోని వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 3) కామారెడ్డిలో ఎన్నికల శంఖారావం పూరించారు. పొందుర్తి నుంచి జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మాట్లాడిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి బిడ్డలు డబ్బుకు అమ్ముడుపోయే వాళ్లు కాదని, పులి బిడ్డలని చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజల గెలుపు బీజేపీ గెలుపు ఖాయమనిపిస్తుందని అన్నారు.
కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా కలిసి ఆయనకోసం ఒక నెల రోజులు కష్టపడితే.. వెంకటరమణారెడ్డి మీకోసం ఐదేళ్లు కష్టపడతాడని చెప్పారు. అనంతరం మాట్లాడిన వెంకటరమణారెడ్డి.. కార్యకర్తలే తన బలం, ధైర్యం అని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని, కామారెడ్డి అభివృద్ధికి తోర్పడాలని పిలుపునిచ్చారు.