Kishan Reddy:రేపటి నుంచి మార్చి ఒకటి వరకూ తెలంగాణ బీజేపీ రథయాత్రలు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-19 06:37 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. రేపటి నుంచి మార్చి ఒకటి వరకూ తెలంగాణ బీజేపీ రథయాత్రలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ చేపట్టనున్న రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయ సంకల్ప యాత్ర జరుగనుంది. 17 నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించి, మొత్తం 4,238 కిలోమీటర్ల మేర బీజేపీ రథయాత్రలు జరుగునున్నాయి. రేపు 5 క్లస్టర్లలో ఒకేసారి సంకల్ప యాత్రలు ప్రారంభమవుతాయని చెప్పారు కిషన్ రెడ్డి. ఈ యాత్రల్లో అస్సాం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లు పాల్గొననున్నారు. ఇక విజయ సంకల్ప యాత్ర ముగింపు ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కానున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్ప యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రోడ్‌షోలు నిర్వహిస్తూ, ప్రజలను కలుస్తూ యాత్ర నిర్వహిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్‌ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 2న బహిరంగ సభ ఉంటుందని, మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అనంతరం కిషన్ రెడ్డి స్వయంగా ప్రచార వాహనాన్ని నడిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కృష్ణాయాదవ్, ఈటల రాజేందర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News