సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన పదేళ్లైనా తెలంగాణ ప్రజల కోసం చేసిందేమీలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా కేసీఆర్ గెలువుడు కష్టమేనని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకు అన్ని శక్తులను ఏకం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూపల్లి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వారి అనుచరులతో భేటీ అయినట్లు చెప్పారు.
పొంగులేటి, జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రతిపాదనపై ఇరువురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సభ నిర్వహించే తేదీని త్వరలనే ప్రకటిస్తామని చెప్పారు. ఖమ్మంలో నిర్వహించే సభకు జనం స్వచ్ఛందంగా తరలిరావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్కు ఒక్క అవకాశమివ్వాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు. ఒక్క ఛాన్సిస్తే రాష్ట్రాన్ని బంగారుమయం చేయంగానీ బతుకుల తెలంగాణగా మారుస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ హయాంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్న వెంకట్ రెడ్డి.. రైతులకు కనీసం లక్ష రుణమాఫీ కూడా చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో చివరకు రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెపుతారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇతర నాయకులు సైతం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.