Komatireddy Venkat Reddy : వచ్చే నెల నుంచి గృహ జ్యోతి స్కీం అమలు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గృహ జ్యోతి స్కీంకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుచేస్తామని ప్రకటించారు. మంగళవారం గాంధీభవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కమిటీ సభ్యులు చర్చించారు.
మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పులపాలైందన్న వెంకట్ రెడ్డి.. ఆ కారణంగానే హామీల అమలు ఆలస్యమవుతోందని అన్నారు. నిరుద్యోగ భృతి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నింటినీ గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.