Komatireddy Venkat Reddy : మేం కక్ష రాజకీయాలు చేయం.. తప్పు చేసిన వారిపై.. : కోమటిరెడ్డి
గత 10ఏళ్లు రాష్ట్రంలోని రోడ్లపై బీఆర్ఎస్ సర్కార్ ఫోకస్ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 9 ఫైళ్లపై సంతకాలు చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. వచ్చే 2 - 3 ఏళ్లలో రోడ్ల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు అడుగుతున్నారని.. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తాము కక్ష రాజకీయాలు చేయమన్న మంత్రి.. తప్పులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడుగుతానని కోమటిరెడ్డి తెలిపారు. ప్రాంతీయ రింగ్ రోడ్ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతానన్నారు. ‘‘విజయవాడ - హైదరాబాద్ హైవేను 6 లైన్‌లకు, హైదరాబాద్ - కల్వకుర్తి హైవేను 4 లైన్‌లకు పెంచాలని కేంద్రమంత్రిని అడుగుతా. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పెంచాలని కోరతాను. 9 ఫైల్స్లో ఐదింటి అనుమతికి సోమవారం గడ్కరీని కలుస్తాను. హైదరాబాద్ - విజయవాడ హైవేకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తాం’’ అని కోమటిరెడ్డి తెలిపారు.