ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పక్షపాతం - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ల కోసం ఆదరాబాదరా కట్టిన ప్రాజెక్టులన్నీ కుంగిపోతాయని అన్నారు. మోడీ ప్రభుత్వం బీఆర్ఎస్ మిత్రపక్షం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే.. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని రూఢీ అవుతుందని అన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని వెంకట్ రెడ్డి విమర్శించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు లైనింగ్ వేసిన కేసీఆర్.. ఎమ్మార్పీ మెయిన్ కెనాల్ ను పట్టించుకోకపోవడంతో కంప చెట్లు మొలుస్తున్నాయని మండిపడ్డారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు లైనింగ్ వేస్తే దేవరకొండ, గుర్రం పోడుతో పాటు నల్లగొండ అసెంబ్లీలోని టెయిల్ ఎండ్ వరకు కూడా నీళ్లు పారుతాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నేతల ఇండ్లలోనే ఇన్ కం ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయని వెంకట్ రెడ్డి అన్నారు. వేల కోట్ల సంపాదించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల్లో సోదాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీ స్కీములను ఆమోదించి 100 రోజుల్లో అమలు చేస్తామని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.