రేవంత్ రెడ్డి చెప్పింది నడవదిక్కడ.. నేనే సీనియర్‌ని: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Update: 2023-07-11 09:00 GMT

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్ద‌లు సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసేందుకు రేవంత్ ఎవ‌ర‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ.. ఏవైనా నిర్ణ‌యాలు తీసుకోవాలంటే.. మా జాతీయ నాయ‌క‌త్వం తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ అధికారం రేవంత్ రెడ్డికి లేద‌ని సీనియ‌ర్లు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చెప్పింది నడవదని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. తాను స్టార్ క్యాంపయిర్‌నని, తాను చెప్పిందే నడుస్తుందన్నారు.

ఉచిత విద్యుత్ విష‌యంలో రేవంత్ మాట్లాడింది త‌ప్పే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కోమ‌టిరెడ్డి స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అవుతుందా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని వెల్లడించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని ఎంపీ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తానైనా, రేవంత్ రెడ్డి అయినా పార్టీ కోఆర్డినేటర్స్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సొంతం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్‌ను అని, అవసరమైతే పార్టీలో తాను చెప్పిందే నడుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని సైతం పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని తెలిపారు.




Tags:    

Similar News