ఖాళీల్లేవ్.. కాంగ్రెస్లో ఎవరూ చేరాల్సిన అవసరం లేదు - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు ఇలాగే వార్తల్లో నిలిచిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నేతలెవరూ కొత్తగా చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ అయిపోయాయని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అంశంపైనా కోమటిరెడ్డి స్పందించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల రోడ్ మ్యాప్ పై చర్చించేందుకు ముఖ్య నేతలను తన నివాసానికి ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.
బాగుపడ్డది కేసీఆర్ కుటుంబమే
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ వెంకటరెడ్డి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 9ఏండ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్ ఖాళీ చేయక తప్పదని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిస్తే ఎవరూ రాలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాగుకు 8గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని సబ్ స్టేషన్లలో లాగ్‌బుక్స్ తీసి నిలదీశాకే కొంచెం ఎక్కువ సేపు కరెంటు ఇస్తున్నారని చెప్పారు.
బీసీని సీఎం చేస్తారా..?
కేటీఆర్‌ను కాకుండా.. బీసీని సీఎంగా చేస్తారా? అని సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. బీసీలకు కాంగ్రెస్‌ను మించి న్యాయం చేసిన పార్టీ మరొకటి లేదన్న ఆయన.. ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ధరణిలో పేరు నమోదు కాకపోవడంతో లక్షలాది మంది రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఓట్ల కోసం దళిత బంధు, బీసీ బంధు పెట్టి.. ఎమ్మెల్యేలు కమీషన్లు దండుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
కలిసి పనిచేద్దాం
ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న నేతలు ఇకపై కలహాలు మాని కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కర్నాటక తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.