నల్గొండ సీటు త్యాగం చేస్తా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీల కోసం నల్లగొండ నియోజకవర్గ సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. బీసీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేయొద్దని పీఈసీలో చెప్పానని ఆయన స్పష్టం చేశారు. పీఈసీ మెంబర్స్, స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీయై ఈ అంశంపై చర్చించాలని సూచించినట్లు వెంకట్ రెడ్డి చెప్పారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, దానికి అందరూ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు టికెట్లు బలహీనవర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అందరి బలాలు పరిశీలించిన తర్వాత సమర్థులకు టికెట్లు కేటాయిస్తామని వెంకట్ రెడ్డి చెప్పారు.
డిక్లరేషన్లు అమలు చేయనిపక్షంలో రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న సీఎం కేసీఆర్.. దళితులకు మూడెకరాలిస్తానని చెప్పి మాట తప్పారని సటైర్ వేశారు. ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారంటే దాని వెనుక ఏదో మతలబుందని వెంకట్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.