ప్రత్యర్థుల మధ్య లొల్లి.. బీఆర్ఎస్ ఎంపీపై మాజీ ఎంపీ ఫిర్యాదు
తెలంగాణలో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య వివాదం రాజుకుంది. ఒకరి అనుచరులను మరో నేత కలవడంతో ఈ గొడవకు కారణమైంది. దీంతో ఇద్దరి నేతలు ఒకరిపైఒకరు తిట్ల పురాణం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎంపీపై మాజీ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తనకు ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రంజిత్ రెడ్డి అనుచరులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. అయితే తన మనుషులను ఎలా కలుస్తావని రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ప్రశ్నించారు. దమ్ముంటే తన మనుషులను తీసుకెళ్లాలని మాజీ ఎంపీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అయితే ఎంపీ తనను దుర్భాషలాడారని మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. సంస్కారం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై పార్టీ పెద్దల సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అలాంటి వ్యక్తులను నేను పట్టించుకోను. ఆయన పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు.