బీఆర్ఎస్కు భద్రాద్రి జడ్పీ ఛైర్మన్ రాజీనామా

Update: 2023-07-01 09:35 GMT

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కారును వీడుతున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఒక జడ్పీటీసీ, 26మంది ఎంపీటీసీలు, 56మంది సర్పంచులు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా కాంగ్రెస్లో చేరనున్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని కనకయ్య ప్రకటించారు. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు ఇల్లందు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరవుతారని చెప్పారు.

గత కొంత కాలంగా కోరం కనకయ్య బీఆర్ఎస్తో అంటిముట్టన్నట్లుగా ఉంటున్నారు. దీంతో ఆయన జడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. అయితే రాజీనామా చేయమనడం కాదని.. దమ్ముంటే అవిశ్వాసం పెట్టుకోవాలని కనకయ్య సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఆయన జడ్పీ చైర్మన్ పదవికి కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేయడం గమనార్హం.

మరోవైపు ఆదివారం జరిగే సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ సమక్షంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక ఈ సభకు భారీగా జనం వచ్చేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ ఏర్పాట్లను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.దీంతో ఖమ్మంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Tags:    

Similar News