తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతోన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ క్రమంలో వారు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుగా పెట్టి.. సభ జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని తెలిపారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యేలు బారికేడ్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కడియం సహా మిగితా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సభలో మాట్లాడనివ్వడం లేదు.. బయట కూడా మాట్లాడనివ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు ఎందుకుని నిలదీశారు. అసెంబ్లీ వద్ద 3 వేల మంది పోలీసులను మొహరించారని మండిపడ్డారు. మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోతే కంచెలు బద్దలు కొడతామని చెప్పారు.
అంతకుముందు అసెంబ్లీలో ప్రసంగించిన రేవంత్ కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సానుభూతి కోసం వీధి నాటకాలు ఆడుతున్నారని కేసీఆర్పై విరుచుకుపడ్డారు. అవినీతి బయటపడుతుందనే ఫాంహౌస్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత బాధ్యతలను తప్పించుకుంటున్నారని ఆరోపించారు. నిజాయితీ ఉంటే అవినీతికి పాల్పడకుంటే మేడిగడ్డలో కుంగిన పిల్లర్లపై నిర్ణయం తీసుకునేలా చర్చించేందుకు సభకు రావాలని సవాల్ విసిరారు.