Breaking News : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి మరొకరు

Update: 2024-02-08 14:35 GMT

జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌కు షాకిచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితుడు. ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో విభేదాల కారణంగా బీఆర్ఎస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్ కోసం ఇరవై రెండేళ్లుగా సైనికుడిలా పనిచేశానని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు రక్షణ కరువైందని తన లేఖలో తెలిపారు. అలాగే పార్టీలో అనుసరించే విధానాలు కూడా తనకు నచ్చలేదన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడి పనిచేశానని, అలాంటి తనకు కొంత మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు లేకుండా కుట్రలు చేస్తున్నారన్నారు.

తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారికే మద్దతు ఇవ్వడం తనను ఎంతగానో బాధించిందని, తనపై కుట్ర జరుగుతోందన్ని విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే ఎటువంటి ప్రయోజనం తనకు కనిపించలేదన్నారు. అందుకే తాను పార్టీ సభ్యత్వానికి, మీడియా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా బాబా ఫసియుద్దీన్ వెల్లడించారు.



Tags:    

Similar News