కడియం వర్సెస్ రాజయ్య ఎపిసోడ్కు ఫుల్ స్టాప్... కేటీఆర్ రాజీ ఫార్ములా ఇదేనా..?
మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. కొన్నాళ్లుగా పరోక్ష యుద్ధం సాగిస్తున్న ఇద్దరు నేతలు ఇటీవలే పేర్లు పెట్టుకుని మరీ తిట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో అప్రమత్తమైన పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంగళవారం రాజయ్యను ప్రగతి భవన్ పిలిపించుకున్న మంత్రి కేటీఆర్ ఆయనకు క్లాస్ పీకినట్లు సమాచారం. దాదాపు 2 గంటల పాటు సాగిన సమావేశంలో కడియం వర్సెస్ రాజయ్య ఎపిసోడ్ కు ఓ రాజీ ఫార్ములాతో కేటీఆర్ తెర దించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కడియంపై ఆరోపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కొన్నాళ్లుగా మరింత ముదిరింది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌ను సమాయత్తం చేసుకోవడంపై రాజయ్య అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయాయంటూ కడియం శ్రీహరి పరోక్షంగా రాజయ్య, ఆయన వర్గాన్ని టార్గెట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో రాజయ్య కడియం శ్రీహరిపై అవినీతి ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టారు. ఆయన తల్లి కులాన్ని ప్రస్తావించడంతో పాటు కడియం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని, ఆయన కూతురు కావ్య కూడా కాంగ్రెస్ చేరుతున్నట్లు తనవద్ద ఆధారాలున్నాయని బాంబు పేల్చారు.
రాజయ్యపై కడియం ఫైర్
కొన్నాళ్లుగా రాజయ్య చేస్తున్న వ్యాఖ్యలపై కడియం ఘాటుగానే స్పందించారు. డాక్టర్ అయిన రాజయ్య సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబసభ్యులు, వ్యక్తిగత విషయాలపై ప్రస్తావించిన రాజయ్య ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజయ్య, అతని అనుచరులు నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్నారని కడియం విమర్శించారు. చివరకు దళిత బంధు పథకంలోనూ ఆయన కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం కొనసాగింది.
కేటీఆర్ రాజీ ఫార్ములా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు సీనియర్ నేతలు బహిరంగంగా విమర్శించుకోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ రాజయ్యను మంగళవారం ప్రగతి భవన్కు పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజయ్య కడియం శ్రీహరి కుటుంబసభ్యుల ప్రస్తావన తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్.. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పనిలో పనిగా కడియం వర్సెస్ రాజయ్య ఎపిసోడ్ కు కేటీఆర్ రాజీ ఫార్ములాతో ఫుల్ స్టాప్ పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కడియంకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, రాజయ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
రాజయ్య తీరుకు రీజనేంటంటే..!
నిజానికి రాజయ్య కడియం శ్రీహరిని ఇంతలా విమర్శించడం వెనుక పెద్ద కారణమే ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారా లేదా అన్న సందిగ్దం రాజయ్యను తీవ్ర అసహనానికి గురిచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడియంకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇవ్వనున్నట్లు కొన్నాళ్ల క్రితం బీఆర్ఎస్ హైకమాండ్ సంకేతాలిచ్చింది. పార్టీ అధినేత స్వయంగా కడియంను పిలిచి నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని సూచించారు. మరోవైపు రాజయ్య సైతం అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తుండటంతో పార్టీ అధిష్టానం ఆయనతోనూ చర్చలు జరిపింది. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. తన సామాజిక వర్గంలో రాజయ్య అంతటి విద్యావంతులు చాలా తక్కువగా ఉంటారని, అందుకే ఆయనను కాపాడుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
టికెట్ భయం..
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చినా రాజయ్యలో మాత్రం ఏదో ఓ మూలన భయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనను పట్టించుకుంటారో లేదోనన్న అనుమానం ఆయనను తీవ్ర అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజయ్య పార్టీలో తన ప్రత్యర్థిగా భావిస్తున్న కడియం శ్రీహరిని టార్గెట్ చేసినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య వర్సెస్ కడియం ఎపిసోడ్ కు చెక్ పెట్టేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. మంగళవారం జరిగిన భేటీలో రాజయ్యకు మరోసారి అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని కచ్చితంగా వరంగల్ ఎంపీగా బరిలో దింపుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వరంగల్ ఎంపీగా ఉన్న పసూనూరి దయాకర్కు ఈ సారి ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఏదైనా పదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయనతో ఇప్పటికే పార్టీ అధినాయకత్వం నచ్చజెప్పినట్లు సమాచారం.