ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యనందిత కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని లాస్య ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాస్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో లాస్య మరణ వార్త విని షాక్ కి గురయ్యానన్నారు. విదేశాల్లో ఉండడం వల్ల రావడం కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య నందితను 10 రోజుల్లో అనేక ప్రమాదాలు వెంటాడాయని తెలిపారు. గత ఏడాది లాస్య నాన్న సాయన్న చనిపోయారని...ఇప్పుడు తను చనిపోవటం బాధాకరమన్నారు. లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించారని అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. లాస్య కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు పరామర్శించారు.