తెలంగాణ కాంగ్రెస్‌ని ఓ పోకిరీ చేతులో పెట్టారు : కేటీఆర్
తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్‌ని ఓ పోకిరీ చేతులో పెట్టారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ అనుచరులు అని చెప్పి బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్‌ను బెదరించిడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి పార్టీని అప్పగించటం బాధాకరమని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. దాసోజ్ శ్రవణ్‌కు అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీని కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులమంటూ గత రాత్రి సుమారు 12.15 గంటల సమయంలో కొందరు తనకు కాల్ చేసి బెదిరించినట్టు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. వారిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించనున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండడం దురదృష్టకరమన్నారు. గతంలో కూడా తన అనుచరుల ద్వారా వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి తదితర సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడినట్లు దాసోజు శ్రవణ్ ఆరోపించారు.