KTR : అభివృధ్ది అంటే ఏంటో తెలంగాణ చూసి నేర్చుకోండి : కేటీఆర్
అభివృధ్ది అంటే ఏంటో తెలంగాణ చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు ప్రజలు 55 ఏళ్లు అధికారం ఇస్తే చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇప్పుడు మరోసారి ఒక్క ఛాన్స్ అంటున్నారని.. వాళ్ల మాటలను నమ్మి మోసపొవద్దని సేచించారు. గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ళ కోసం రైతులు తన్నుకుంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఏడాది కూడా కరువు కాటకాలు లేవన్నారు.
నిర్మల్ జిల్లాలోని పాక్ పట్లలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీతో 300 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఏడాదికి రెండు లక్షల ఆదాయం వస్తుందన్నారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ పామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తామని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు. రివర్స్ పంపుతో ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో తాగు, సాగునీరు లేక ప్రజలు అష్టకష్టాలు పడ్డారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 17 ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు. దాంతో రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 27ను ప్రారంభించుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు