ఎమ్మెల్సీలు పార్టీకి చెవులు, కళ్లలాగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. మండలి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పోలీట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారని.. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామన్నారు. ఈ ఏడాదంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని.. ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని సూచించారు. త్వరలోనే ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమవుతారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని చెప్పారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయన్నారు. తాము కూడా అదే పనిచేస్తామని.. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.