ఒకరికి ప్రభుత్వ సాయం అందితే.. మరొకరు ఈర్ష పడుతున్నారు : కేటీఆర్
కాంగ్రెస్ నెల రోజుల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ఠ మూటగట్టుకుందన్నారు. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేటీఆర్ అధ్యక్షతన జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగులను మారిస్తే ఫలితాలు మరోలా వచ్చేవన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగనివ్వమని చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుందని.. అయినా పరిస్థితులు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ‘బంధు’ పథకాల ప్రభావం పడిందన్నారు. ఒకరికి ప్రభుత్వ సాయం అందితే.. మరొకరు ఈర్షపడేలా సమాజం తయారైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభివృద్ధిని కాంగ్రెస్ తక్కువ చేసి చూపుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంట్ ఫలితాల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్ కు సూచించారు.
ఎన్నికలు అన్నప్పుడు గెలుపోటములు సహజమని కేటీఆర్ అన్నారు. 2009లో బీఆర్ఎస్ 10 అసెంబ్లీ సీట్లు గెలిస్తే.. మారిన పరిస్థితులతో 2014లో అధికారంలోకి వచ్చామని చెప్పారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడినా.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలిచి సత్తా చాటిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్లు కూడా పునరాలోచనలో పడ్డారన్నారు. తెలంగాణ ప్రజల కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ అనే పదమే వినబడడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదం మాయం చేస్తారని అన్నారు.