KTR : పార్లమెంట్ ఎన్నికల్లో దానిని అనుకూలంగా మలుచుకోవాలి : కేటీఆర్

Byline :  Krishna
Update: 2024-01-22 09:24 GMT

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ సమావేశం జరిగింది. జనవరి 3న ఆదిలాబాద్తో ప్రారంభమైన ఈ సమావేశాలు ఇవాళ నల్లగొండతో ముగుస్తున్నాయని తెలిపారు. అన్ని సమావేశాల్లో కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని.. వారి వల్లే పార్టీ బలంగా ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొగొండలో బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నట్లు అనిపించిందని.. ఎటువంటి అనుమానం రాలేదని వ్యాఖ్యానించారు. కానీ ఫలితాలు మాత్ర మరోలా వచ్చాయన్నారు.




 


పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని కార్యకర్తలు అభిప్రాయపడినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ పార్లమెంట్ సన్నాహాక సమావేశాలు ఆరంభం మాత్రమే అని చెప్పిన ఆయన.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు చేపడతామన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని అభిప్రాయపడ్డారు. అవతల పార్టీ వాళ్లు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. గత నెలనే కరెంట్ బిల్ కట్టొద్దని కాంగ్రెస్ నేతలు చెప్పారని.. ఈ నెల బిల్ ఆ పార్టీ నేతలు పంపించాలన్నారు.




 


బీఆర్ఎస్ ప్రశ్నించకముందే కాంగ్రెస్ ఉలిక్కిపడుతోందని.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండంటూ కేటీఆర్ చెప్పారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా అనుకోలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హామీలు అమలు చేసేవరకు ఆ పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో సాగర్ ఆయకట్టుకు తొలిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్తితి దాపురించిందని మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీ అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీలో బయటపడిందన్నారు. రాహుల్ అదానీని దొంగ అంటే రేవంత్ దొర అంటున్నారని విమర్శించారు. కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి ఉందని.. దీనిని పార్లమెంట్ ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Tags:    

Similar News