KTR: 'వారి మాటలనే నేను గుర్తుచేస్తున్నా'.. కరెంట్ బిల్లులపై మరోసారి కేటీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2024-01-21 08:05 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో చెప్పారని అన్నారు. అంతకుముందు నవంబర్ నెల నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారని.. తాను వారి మాటలనే గుర్తుచేస్తున్నానని కేటీఆర్ అన్నారు. శనివారం జరిగిన సమావేశంలో ఈ నెల నుంచి బిల్లులు కట్టొద్దని తాను చెబితే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటీఆర్ ది విధ్వంసకర మనస్తత్వం అని మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల నుంచి తెలంగాణలో ఎవరూ కరెంట్ బిల్లులు కట్టొద్దని.. బిల్లులను సోనియా గాంధీకే పంపుదామని కేటీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

ఇక నిన్న తెలంగాణ భవన్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్ పై నిప్పులు చేరిగారు. ‘‘రేవంత్​ లెక్కనే ఎందరో మఖలో పుట్టి పుబ్బలో పోతదని బీఆర్​ఎస్​పై నీలిగిండ్రు.. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది” అని అన్నారు. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొందపెడ్తవ్​? .. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతయ్​.. రేవంత్ కాంగ్రెస్​కు ఏక్ నాథ్ షిండేగా మారతడు.. రేవంత్ రక్తం బీజేపీదే.. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు.. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అదానీతో అలయ్​బలయ్​ చేసుకున్నడు.. అదానీ, రేవంత్ రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి..” అని కేటీఆర్​ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని గతంతో చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్​గా మారారని విమర్శించారు.




Tags:    

Similar News