మోదీ తెలంగాణ విరోధి, పుట్టగతులు ఉండవ్.. కేటీఆర్ భగ్గు..

Update: 2023-09-18 12:16 GMT

తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఆయన మాటలపై భగ్గుమంటున్నారు. మోదీ తెలంగాణకు బద్ధవిరోధి అని విమర్శిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు రాష్ట్రంపై విషం చిమ్మడే పనిగా పెట్టుకున్నారని, తెలంగాణలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మోదీ ఇలాంటి మాటలతో తెలంగాణను అవమానించడం కొత్తేమీ కాదన్నారు. డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని, డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు మీ పాలనలో ఒక్క విషయం లేదు కాబట్టే ప్రతిసారీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారా? రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా తెలంగాణపై ఎందుకింత కక్ష? తెలంగాణతో ఏమిటీ వివక్ష? అడ్డగోలుగా విభజన చేశారని ఒకసారి, తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోసారి తెలంగాణలో సంబరాలు జరగనే లేదని ఇంకోసారి.. ఇలా ఎన్నిసార్లు పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారు? మా దశాబ్దాల కల నెరవేరిన నాడు అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? నాటి ఉత్సవం నుంచి నేటి దశాబ్ది ఉత్సవం వరకూ ప్రతి తెలంగాణ పుట్టిన రోజు మా అందరికీ పండుగరోజు. గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే. తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా నిలిచి సమున్నత శిఖరాలను అధిరోహించింది తెలంగాణ. ఈ ప్రగతి ప్రస్థానాన్ని చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్‌ను మించిపోయిందనేనా మీకు తెలంగాణపై గుండెలనిండా ఇంతటి ద్వేషం? ప్రధానమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరే రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియపై ఎలా నిందలు వేస్తారు? ఇది ప్రాణత్యాగం చేసిన అమరులను, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, కోట్లాది మంది ప్రజల మనసులను గాయపరచడమే’’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు

పార్లమెంట్‌లో ఇచ్చిన విభజన హామీలకు పాతరేసి అబద్ధాల జాతర చేస్తామంటే సహించబోమని హెచ్చరించారు. ‘‘ఆనాడు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేశారు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మోసం చేశారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోండి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపండి అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పండి ద్వేషం కాదు. దేశం ముఖ్యం.. దేశం అంటే రాష్ట్రాల సమాహారం’’ అని అన్నారు.

‘‘మోదీ తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకు? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం ఏం సంస్కారం? తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా?తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు? పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు? ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొనిమా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు? వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మా రైతుల్ని మీ కేంద్రమంత్రి కించపరిచారు. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు! మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు. కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించండి. ఏడు మండలాలు గుంజుకొని లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతిలేకుండా మిషన్ కాకతీయ, భగీరథలకు నిధులను నిరాకరించిన మీ నిర్వాకాన్ని ఏమనాలి? కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలి?’’ అని నిలదీశారు.

కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేశారని మండిపడ్డారు. ‘‘157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా! పైన అప్పర్ భద్ర, కింద పోలవరం, ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేంది? బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారు ఎందుకు? సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తారు. ఐటీఐఆర్‌ను రద్దు చేశారు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారు’’ అని ఆక్షేపించారు.

Full View

Tags:    

Similar News