Hyderabad: మూసీపై 7 చోట్ల బ్రిడ్జిలు.. శంకుస్థాపన చేయనున్న కేటీఆర్
హైదరాబాద్వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు మూసీ నదిపై 7 వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా.. మార్పులకు శ్రీకారం చుట్టింది. పారిస్ తరహా బ్రిడ్జిల మాదిరిగా నిర్మించే ఈ వంతెనలు నగర సిగలో మరో ఐకానిక్‌గా నిలువనున్నాయి. టెండర్లు పూర్తయిన 7 చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులకు సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు దుర్గం చెరువులో మురుగునీరు చేరకుండా నిర్మించిన 7 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని, దుర్గం చెరువులో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఆయన ప్రారంభిస్తారు.
7 బ్రిడ్జిలకు శంకుస్థాపన
ఉప్పల్ భగాయత్ లే అవుట్ వద్ద రూ.42 కోట్లతో, ప్రతాప సింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లతో, మంచిరేవుల వద్ద రూ.39కోట్లతో, బుద్వేల్ ఐటీ పార్కు-2 సమీపంలో ఈసీపై రూ.32 కోట్లతో, బుద్వేల్ ఐటీ పార్కు-1 సమీపంలో ఈసీ నదిపై రూ.20కోట్లతో హెచ్‌ఎండీఏ బ్రిడ్జిలను నిర్మించనుంది. ఇక మూసారాంబాగ్ వద్ద జీహెచ్‌ఎంసీ, ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు మూసీ నదిపై హెచ్‌ఆర్‌డీసీఎల్ నిర్మాణ పనులు చేపట్టనుంది. ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసీపై ఫోర్ లేన్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ 7 వంతెనల నిర్మాణం 15 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దుర్గం చెరువులో ఫౌంటెయిన్లు
హుస్సేన్‌సాగర్ తరహాలోనే దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దుర్గం చెరువులో రూ.9 కోట్ల వ్యయంతో 40 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు కలిగిన రెండు మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్‌లు ఏర్పాటు చేసింది. కేబుల్ బ్రిడ్జికి ఇరు వైపులా ఉన్న వీటిని సాయంత్రం కేటీఆర్ ప్రారంభించనున్నారు. మ్యూజిక్ ఫౌంటెయిన్ షో దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుంది.
కేటీఆర్ షెడ్యూల్ ఇదే..
మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 1 గంటలకు హెచ్‌ఆర్‌డీసీఎల్ ఆధ్వర్యంలో ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు మూసీ నదిపై చేపట్టే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 2 గంటలకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న 5 బ్రిడ్జి నిర్మాణ పనులకు ఉప్పల్ భగాయత్ లే అవుట్ శిల్పారామం వద్ద ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మూసారాంబాగ్ వద్ద నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు దుర్గం చెరువు వద్ద 7ఎంఎల్‌డీ సామర్థ్యంలో జలమండలి నిర్మించిన ఎస్టీపీతో పాటు సాయంత్రం 6:30 గంటలకు దుర్గం చెరువులో రెండు చోట్ల ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్‌లను కేటీఆర్ ప్రారంభించనున్నారు.