జగన్ నీటి దోపిడిని కేసీఆర్ అడ్డుకోలేదు : Kunamneni Sambasiva Rao

Byline :  Krishna
Update: 2024-02-12 10:49 GMT

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని వైఎస్‌ఆర్‌ హయాంలోనే పెంచారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై అప్పట్లో ఆందోళనలు జరిగాయని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ అందరినీ ఒప్పించి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు. కానీ ఏపీ సీఎం జగన్‌ 94 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకపోతున్నారని ఆరోపించారు.

అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జగన్ చర్యను అడ్డుకోలేదని కూనంనేని విమర్శించారు. విభజన చట్టంలోనే ప్రాజెక్టుల అప్పగింతపై నిబంధనలు ఉన్నాయన్న ఆయన.. అప్పుడే వ్యతిరేకించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరణపై చెన్నై గ్రీన్ ట్రిబునల్ స్టే విధించిందని.. అందులో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమి లేదని ఆరోపించారు. నీళ్లు, నియామకాలు, నిధులు మీద ఏర్పడ్డ రాష్ట్రంలో నీటి పంపకాలను బీఆర్ఎస్ సరిగ్గా పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రం సహకారం లేకపోతే నీటి హక్కులు కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు.

Tags:    

Similar News