మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భార్య పేరుపై రూ.కోట్ల విలువైన భూములు!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ (Somesh Kumar)పై.. ధరణి పోర్టల్ విషయంలో సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ధరణి పోర్టల్ రూపకర్త అయిన ఈ మాజీ సీఎస్ ఆస్తులపై ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తున్నది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లు కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి బాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమేశ్‌కుమార్ గతంలో రెరా కు చైర్మన్ గా వ్యవహరించడం, వీరిద్దరూ ఒకే సందర్భంలో రెరాలోనూ కొనసాగడంతో సోమేశ్ కుమార్‌పై కాంగ్రెస్ దృష్టిపెట్టినట్లు సమాచారం. సోమేశ్ కుమార్ తన భార్య పేరు పై 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ(రెవిన్యూ) పరిధిలో మహిళా పట్టాదారు డా గ్యన్ముద్ర (ఫాదర్ లేదా భర్త పేరు సోమేష్ కుమార్) పేరిట ఖాతా నం.5237 ద్వారా సర్వే నం.249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాలు, 260/అ/1/1 లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ధరణి పోర్టల్ లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం. 5237 గా ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు మూడు వేలకు మించి లేరు. మరి ఈ ఖాతా నంబరు(నం. 5237) ఏ విధంగా కేటాయించారన్నది ప్రస్తుతం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ భూమి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయలేదని తెలుస్తున్నది. భూమి కొనుగోలు విషయంలో డీఓపీటీకి సోమేశ్ కుమార్ సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహరంలోనే ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. అయితే సోమేశ్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పని చేస్తోన్న కాలంలో కొనుగోలు చేశారా? అంతకు ముందే ఆయన కొన్నారా? అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు.