నేటితో ముగియనున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.. మళ్లీ పొడగిస్తారా?
రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన డిస్కౌంట్ స్కీం ఇవాళ్టితో ముగుస్తుంది. రాత్రి 11: 59 గంటల వరకు పెండింగ్ చెలాన్లు డిస్కౌంట్ లో కట్టొచ్చు. పోయిన ఏడాది డిసెంబర్ 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత రాయితీ గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. వాహనదారుల నుంచి ఫిర్యాదు వస్తున్న క్రమంలో.. గడువు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిసెంబర్ నాటికి 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించింది.
చలాన్ల గడువు ఇప్పటికే రెండు సార్లు పొడగించిన ప్రభుత్వం.. మరోసారి పెంచే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఒక కోటి అరవై ఆరు లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. చలాన్ల రూపంలో ఇప్పటి వరకు రూ.147 కోట్లు వసూలైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.