Lasya Nandita: లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాసేపటి క్రితం పోస్ట్ మార్టమ్ పూర్తి అయింది. మరికాసేపట్లో లాస్య భౌతిక కాయాన్ని కార్ఖానాలోని ఆమె సొంత ఇంటికి తరలించనున్నారు. గాంధీ ఆసుపత్రికి హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, కార్పొరేటర్ విజయారెడ్డి లు వెళ్లారు. ఈస్ట్ మారేడుపల్లిలో తండ్రి సాయన్న సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు చేయనున్నారు. ఇక, లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఆమె కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
కాగా, ఇవాళ ఉదయం తెల్లవారుజూమున హైదరాబాద్ శివారు పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్‌పై ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదానికి గురింది. ప్రమాదవశాత్తూ ఆమె ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే లాస్య మృతదేహాన్ని పటాన్ చెరులోని అమేదా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అమేధా ఆసుపత్రి నుండి లాస్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కార్ఖానాలోని సొంత ఇంటికి లాస్యనందిత మృతదేహాన్ని తరలించనున్నారు.