భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుతున్నాయి. చెరువు కట్టలు తెగిపోవడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వరదలో చిక్కుకుపోయిన ఓ నిండు గర్భిణిని హాస్పిటల్ కు చేర్చేందుకు పెద్ద సాహసమే చేశారు.
భీంగల్ మండలం పిప్రీ గ్రామానికి చెందిన అనిత నిండుగర్భిణి. గురువారం పురుటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆర్మూర్ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే చెరువు కట్ట తెగిపోవడంతో పిప్రీ - బాచన్ పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లడం కష్టంగా మారింది.
అనిత పరిస్థితి గమనించిన స్థానికులు ఓ సాహసానికి సిద్ధమయ్యారు. ఆమెను రోడ్డు దాటించేందుకు జేసీబీని రప్పించారు. జేసీబీ ద్వారా బాచన్ పల్లి గ్రామానికి తరలించి అక్కడి నుంచి 108 ద్వారా ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనిత సురక్షితంగా హాస్పిటల్ కు చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.